24, అక్టోబర్ 2020, శనివారం

చంద్రబాబుగారూ ఇదేమి వాదన...! ఇదెక్కడి లాజిక్‌..!!

విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఆక్రమించిన కోట్లాది రూపాయల విలువ చేసే 40 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. శనివారం తెల్లవారుజామునే రెవెన్యూ అధికారులు జెసిబి యంత్రాలతో, పోలీసు బలగాలతో యూనివర్సిటీకి చేరుకుని కూల్చివేతలు మొదలుపెట్టారు. తెల్లారేసరికి కూల్చివేతలు పూర్తిచేసి, ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నారు. 



ఈ యూనివర్సిటీ టిడిపి అధినేత నారా చంద్రబాబు కుమారుడైన నారా లోకేష్‌ తోడల్లు శ్రీభరత్‌కు చెందినది. ఇంకా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడి కుటుంబానికి చెందినది. అందుకే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ భూముల అక్రమణను తొక్కిపెట్టారన్న విమర్శలొచ్చాయి. 

గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూములను ఆక్రమించడమేగాక అందులో అనుమతి లేకుండా కట్టడాలు, అండర్‌ గ్రౌండ్‌ రోడ్లు నిర్మించింది. దీనిపైన గతంలోనే రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆక్రమణలను అంగీకరిస్తూనే....ఆ భూములను ఎకరా రూ.18 వేల వంతన తమకే విక్రయిస్తే కొనుగోలు చేస్తామని సదరు యూనివర్సిటీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఆ ప్రతిపాదను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికలొచ్చి ప్రభుత్వం మారిపోయింది. ఇప్పటి ప్రభుత్వం ఆక్రమణలను తొలగించింది.

ఈ వ్యవహారంలో తేలేదేమంటే...గీతం యూనివర్సిటీ భూములను ఆక్రమించుకున్నది వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వమే ఈ ఆక్రమణలను ధ్రువీకరించింది. అందువల్లే ఇప్పుడు చంద్రబాబు గట్టిగా ఖండించలేదకున్నారు. గీతం యూనివర్సిటీ భూములను ఆక్రమించలేదని చెప్పలేకున్నారు. అందుకే సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.


గీతం యూనివర్సిటీకి చెందిన వైద్య కళాశాల 2900 మంది కోవిడ్‌ బాధితులకు ఉచితంగా చికిత్స చేసింది...అటువంటి సంస్థ నిర్మాణాలను కూల్చేస్తారా..? అని చంద్రబాబు ఆక్రోశించారు. వందల కోట్ల రూపాయల భూములను ఆక్రమించుకుని, కొందరు కోవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తే....ఆక్రమణలను చూసీచూడనట్లు వదిలేయాలా? కోటి రూపాయలు తినేసి వంద రూపాయల సేవ చేస్తే మహనీయులైపోతారా? ఇదేమి వాదన. అదేవిధంగా ఉత్తరాంధ్రకు తలమానికంగా ఉన్న యూనివర్సిటీలో ఆక్రమణలు కూల్చుతారా అని కూడా బాబు మండిపడ్డారు. ఈ లెక్కన ఏ విద్యాసంస్థయినా యథేచ్ఛగా ఆక్రమణలు చేసుకోవచ్చన్నమాట. 

ఇక రెండో వాదన ఎప్పుడూ ఉండేదే. అదే కక్షసాధింపు. 'టిడిపి నేతలపై కక్షసాధిస్తున్నారు. మొన్న సబ్బం హరి, ఇప్పుడు గీతం యూనివర్సిటీ నిర్మాణాలను కూల్చేశారు. నిర్మించలేని వాళ్లకు కూల్చే హక్కులేదు.' ఇదీ చంద్రబాబు చెప్పిన మరోమాట. అనంతపురం జెసి దివాకర్‌ రెడ్డి కాలం చెల్లిన వాహనాలు తిప్పుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే...దాన్ని కట్టడి చేయడాన్ని కూడా కక్షసాధింపుగానే చెప్పారు. అచ్నెన్నాయుడు ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో కోట్లు మింగితే అదీ కక్షపాధింపు అన్నారు. పదిమంది కోవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోడానికి కారణమైన రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యంపై కేసులు పెడితే.,..కక్షసాధింపుగా అభివర్ణించారు. ఇప్పుడు అదీ పల్లవి అందుకున్నారు. 

గీతం యూనివర్సిటీలో ఆక్రమణలు లేవనుకుంటే లేవని చెప్పాలి. అంతేగానీ ఆక్రమణలు ఉన్నాయని తేలి, ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుంటే కక్షసాధింపు అని చెప్పడంలో అర్థం లేదు. తమ వాదనలో బలం లేపుడు ఇటువంటి సెంటుమెంటు అంశాలు తెరపైకి తెస్తారు. అయితే ఇవి చట్టం ముందు నిలబడవు. 

ఏదిఏమైనా గీతం వర్సిటీ ఆక్రమణలోని 40 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోడాన్ని అభినందించాలి. ఇటువంటి భూములు ఎక్కడున్నా గుర్తించి స్వాధీనం చేసుకుని ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వినియోగించాలి. 

                                                                                                                                        - ధర్మచక్రం ప్రతినిధి


అమరావతిలోకి ప్రవేశించడానికి వీసా కావాలా..!!

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అక్కడి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మూడు వందల రోజులకుపైగా ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు జరుగుతున్నా ఎటువంటి ఆటంకం, అభ్యంతరం లేకుండా సాగిపోతున్నాయి. ఇదే సమయంలో మూడు రాజధానులను సమర్ధించేవారు ఇదే అమరావతిలోని  ఆందోళనకు పూనుకుంటే అక్కడివారు అడ్డుకున్నారు. ట్రాక్టర్లతో తొక్కిస్తామని బెదిరిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం..?


రాజధానిలో ఆందోళనలు చేపట్టే హక్కు ఎవరికైనా ఉంటుంది. పోలీసుల వద్ద అవసరమైన అనుమతులు తీసుకుని ఆందోళనలు చేసుకోవచ్చు. ఏదైనా ఇబ్బందులు ఉంటే పోలీసులే అనుమతులు నిరాకరిస్తారు. అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమాలు చేపడితే పోలీసులు అడ్డుకుంటారు. పోలీసులు అనుమతించినా మూడు రాజధానులను సమర్ధించే వారిని... రాజధాని రైతుల పేరుతో ఆందోళనలు చేస్తున్నవారు అడ్డుకుంటున్నారు. బెదిరిస్తున్నారు. స్థానికేతరులు ఇక్కడెలా ఆందోళనలు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. 

మూడు రాజధానుల ఉద్యమానికి ఆందోళనకారులను ఆటోల్లో తరలిరావడాన్ని తప్పుబడుతూ రాసింది ఓ పత్రిక. మరి అమరావతి ఉద్యమానికి ఎవరూ తరలించకుండానే, ఎవరూ ఆర్గనైజ్‌ చేయకుండానే ఉద్యమం సాగుతోందా..? ఇటువంటి వివచక్షాపూరిత వార్తలెందుకు..?

ఇటువంటి ధోరణి గురించే ప్రజలు ఆందోళన చెందుతోంది. రాజధాని ప్రాంతంలో  50 వేల మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తే....దాన్ని న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారు. స్థానికేతరులకు రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇవ్వకూడదని వాదిస్తున్నారు. ఇప్పుడు రాజధానిలో తాముతప్ప ఇతరులెవరూ ఆందోళనలు కూడా చేయకూడదన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణిని ఒకవర్గం మీడియా కూడా సమర్ధించడం విషాదం. కార్పొరేట్‌ సంస్థలకు, బడా వ్యాపారవేత్తలకు వందల ఎకరాల భూములను ఇచ్చినపుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదుగానీ....పేదకు స్థలాలు ఇస్తామంటే మాత్రం ఆటంకాలు సృష్టిస్తున్నారు.

300 రోజులుగా అమరావతి సమర్ధకులు ఆందోళనలు చేస్తున్నా ఏఒక్కరూ అడ్డకోలేదు. ఆటంకాలు సృష్టించలేదు. మూడు రాజధానులను సమర్ధించేవారిని ఆందోళనలు ప్రారంభించిన మొదటి రోజే అడ్డుకోవడం గమనార్హం. మా ప్రాంతానికి ఎలా వస్తారంటూ బెదిరించడం చూస్తే....అమరావతి ప్రాంతానికి రావాలంటే వీసా అవసరమేమో అనే భావన ఇతర ప్రాంతాల వారికి కలుగుతుంది. ఇది అమరావతి ఉద్యమానికి మంచిది కాదు. 

ఈ పరిస్థితుల్లో అమరావతి రైతుల ఆందోళనకు ఇతర ప్రాంతాలవారి మద్దతు ఎలా లభిస్తుందన్నది ప్రశ్న. మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళనలు చేపడితే...తమ ఉద్యమం (అమరావతి అనుకూల) నీరుగారిపోతుందన్న భయం వారిలో ఉండొచ్చు. నిజంగానే అమరావతి రాజధానిపై ప్రజల్లో సెంటిమెంటు ఉంటే అంతగా భయపడాల్సిన పనిలేదు. మూడు రాజధానులను సమర్ధించేవారిని అడ్డుకుంటే...అది ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అమరావతి రైతులు తమ ధోరణిని మార్చుకోవాలి. మూడు రాజధానులను సమర్ధించే వారికీ తమలాగే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేపట్టే హక్కు ఉందనే విషయాన్ని గుర్తించాలి.             

                                                                                                      - ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ఎడిటర్‌


18, అక్టోబర్ 2020, ఆదివారం

ఈవోగారూ ఇదేమి ధర్మం...! కాంట్రాక్టు కార్మికులకు ఆకలి ఉండదా...!!

కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న శ్రీనివాసుడు కొలువైన తిరుమల కొండపైన ఏ ఒక్కరూ ఆకలితో పస్తులు ఉండకూడదన్న మహత్తర లక్ష్యంతో టిటిడి అన్న వితరణ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. నిత్యంలో వేలాది మందికి అన్నప్రసాదాలు అందిస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమానికి దాతలు కూడా విరివిగా విరాళాలు అందిస్తున్నారు.

17, అక్టోబర్ 2020, శనివారం

టిటిడి బెరుకు...వెనకడుగు ఎందుకు..! పాలక మండలి నిర్ణయాల అమలుపై తడబాటు..!

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి తన నిర్ణయాలపై తానే తడబడుతోంది. చేసిన తీర్మానాలను అమలు చేయడంలో వెనుకంజ వేస్తోంది. మీడియాలో వచ్చే విమర్శలకు బెదిరి అదిరిపోతోంది. దీంతో మంచి నిర్ణయాలు కూడా అమలు కాకుండాపోతున్నాయి. ఫలితంగా తిరుమల శ్రీనివాసునికి నష్టం జరుగుతోంది.

టిటిడి నగదును అధిక వడ్డీ వచ్చే ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో పెట్టాలని చేసిన తీర్మానం నుంచి వెనక్కి తగ్గారు. శ్రీవారి సొమ్మును ప్రభుత్వ ఖజానాకు తరలించేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ఏమాత్రం ఔచిత్యం లేని రాద్దాంతం చేసే సరికి టిటిడి తన నిర్ణయాన్ని ఉపసంహరిం చుకుంది. టిటిడి డబ్బులు బ్యాంకుల్లో తప్ప ప్రభుత్వ సెక్యూరిటీల్లో డిపాజిట్‌ చేయడం లేదని ప్రకటించింది. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టడం వల్ల శ్రీవారికి అదనపు వడ్డీ వస్తుంది తప్ప నష్టం జరిగదు. (దీనిపైన ధర్మచక్రం ప్రత్యేక కథనాన్ని దీనికి ముందు పోస్టులో ప్రచురించింది). అయినా విమర్శలకు భయపడి వెనకడుగులు వేశారు.

టిటిడికి చెందిన, నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించాలని పాలక మండలి ఆ మధ్య ఒక తీర్మానం చేసింది. దీనిపైన ప్రభుత్వ వ్యతిరేక మీడియా..'స్వామివారి ఆస్తులు అమ్మేస్తున్నారు' అంటూ గగ్గోలుపెట్టింది. దీంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. టిటిడి ఆస్తులేవీ అమ్మబోమని ప్రకటించారు. దీనివల్ల తిరుమలేశునికి నష్టం జరుగుతుందనే చెప్పాలి. ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటిని రక్షించుకోడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తోంది. అటువంటి వాటిని అమ్మేసి నగదు ఖజానాలో సమచేసివుంటే మేలు జరిగేది. ఏవో రాజకీయ కారణాలతో ఎవరో విమర్శలు చేస్తే....టిటిడి వెనకడుగు వేసింది.

ఈ రెండు ఉదంతాలను చూస్తే...ఎందుకిలా జరుగుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. పాలక మండలిలో సమగ్రంగా చర్చించి, టిటిడికి ప్రయోజనకరంగా ఉంటుందని భావించి నిర్ణయం తీసుకున్నాక....అమల్లోకి వచ్చే సరికి ఎందుకు తటపటాయి స్తున్నారు. పాలక మండలి ఏ ఉద్దేశంతో నిర్ణయం తీసుఉందో ప్రజలకు వివరించాలి. అంతేగానీ విమర్శలకు భయపడి అమలును ఉపసంహరించుకుంటే ఎలా? దీనివల్ల టిటిడి ప్రతిష్ట దెబ్బతినదా?

టిటిడి కేంద్రంగా చేసుకుని రాజకీయం చేయాలన్న ప్రయత్నాలు చాలాకాలంగా జరుగుతూనే ఉన్నాయి. టిటిడిపై వస్తున్న విమర్శల్లో చాలావరకు రాజకీయమైనవే. ఇది తెలిసి కూడా నిర్ణయాలను ఉపసంహరించుకుంటే ప్రజల్లోకి ఎటువంటి సందేశం వెళుతుంది? పాలక మండలి చేతకానితనంగా ముద్రపడదా? ఒకవేళ సున్నితమైన అంశాలనుకుంటే ఒకటికి పదిసార్లు చర్చించిన మీదటే తుది నిర్ణయం తీసుకోవాలి. అలా నిర్ణయం తీసుకున్నాక ఎన్ని విమర్శలొచ్చినా ముందడుగే వేయాలి. ఇలా చీటికి మాటికీ...వెనకడుగు వేస్తే పాలక మండలి తీసుకునే నిర్ణయాలపై భక్తులకు ఏమాత్రం గౌరవం ఉండదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.

                                                                                                      - ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం