21, డిసెంబర్ 2020, సోమవారం

టిటిడిలో డిప్యూటీ ఈవో డిప్యుటేషన్‌ వివాదం...!

ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని టిటిడి డిప్యూటీ ఈవోగా డిప్యుటేషన్‌పై తీసుకొస్తున్న వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. పంచాయతీరాజ్‌ విభాగంలో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న పి.శ్రీనివాసరావును టిటిడి డిప్యూటీ ఈవోగా బదిలీ చేస్తూ జోవో జారీ అయింది. టిటిడిలో డిప్యూటీ ఈవోగా నియమించాలంటే ఆర్‌డిఓ స్థాయి అధికారి అయివుండాలి. అటువంటిది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ హోదా కలిగిన ఉద్యోగిని ఎలా నియమిస్తూరని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

టిటిడిలో ఆరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (డిప్యూటీ ఈవో) పోస్టుల్లో ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్‌పై నియమించే అవకాశం వుంది. ఇందులో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే సమయంలో టిటిడి ఐటి విభాగానికి ఒక నిపుపుడు కావాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో పంచాయతీరాజ్‌ విభాగంలో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న పి.శ్రీనివాసరావును డిప్యుటేషన్‌పై డిప్యూటీ ఈవోగా తీసుకొస్తున్నారు. 

ఇక్కడ సాంకేతికపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. డిప్యూటీ ఈవోగా రావాలంటే ఆర్‌డిఓ స్థాయి అధికారులకు మాత్రమే అవకాశం ఉంటుందని, అటువంటి పోస్టులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను నియమించడం సరైనది కాదని టిటిడి ఉద్యోగులు అంటున్నారు. శ్రీనివాసరావును టిటిడి ఐటి విభాగంలో నియమిస్తే....ఆయన కంటే ఎక్కువ హోదా కలిగిన అధికారులు ఎలా పని చేయగలరని ప్రశ్నిస్తున్నారు. ఈ నియామకంపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. - ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి


24, అక్టోబర్ 2020, శనివారం

చంద్రబాబుగారూ ఇదేమి వాదన...! ఇదెక్కడి లాజిక్‌..!!

విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఆక్రమించిన కోట్లాది రూపాయల విలువ చేసే 40 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. శనివారం తెల్లవారుజామునే రెవెన్యూ అధికారులు జెసిబి యంత్రాలతో, పోలీసు బలగాలతో యూనివర్సిటీకి చేరుకుని కూల్చివేతలు మొదలుపెట్టారు. తెల్లారేసరికి కూల్చివేతలు పూర్తిచేసి, ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నారు. 



ఈ యూనివర్సిటీ టిడిపి అధినేత నారా చంద్రబాబు కుమారుడైన నారా లోకేష్‌ తోడల్లు శ్రీభరత్‌కు చెందినది. ఇంకా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడి కుటుంబానికి చెందినది. అందుకే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ భూముల అక్రమణను తొక్కిపెట్టారన్న విమర్శలొచ్చాయి. 

గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూములను ఆక్రమించడమేగాక అందులో అనుమతి లేకుండా కట్టడాలు, అండర్‌ గ్రౌండ్‌ రోడ్లు నిర్మించింది. దీనిపైన గతంలోనే రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆక్రమణలను అంగీకరిస్తూనే....ఆ భూములను ఎకరా రూ.18 వేల వంతన తమకే విక్రయిస్తే కొనుగోలు చేస్తామని సదరు యూనివర్సిటీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఆ ప్రతిపాదను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికలొచ్చి ప్రభుత్వం మారిపోయింది. ఇప్పటి ప్రభుత్వం ఆక్రమణలను తొలగించింది.

ఈ వ్యవహారంలో తేలేదేమంటే...గీతం యూనివర్సిటీ భూములను ఆక్రమించుకున్నది వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వమే ఈ ఆక్రమణలను ధ్రువీకరించింది. అందువల్లే ఇప్పుడు చంద్రబాబు గట్టిగా ఖండించలేదకున్నారు. గీతం యూనివర్సిటీ భూములను ఆక్రమించలేదని చెప్పలేకున్నారు. అందుకే సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.


గీతం యూనివర్సిటీకి చెందిన వైద్య కళాశాల 2900 మంది కోవిడ్‌ బాధితులకు ఉచితంగా చికిత్స చేసింది...అటువంటి సంస్థ నిర్మాణాలను కూల్చేస్తారా..? అని చంద్రబాబు ఆక్రోశించారు. వందల కోట్ల రూపాయల భూములను ఆక్రమించుకుని, కొందరు కోవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తే....ఆక్రమణలను చూసీచూడనట్లు వదిలేయాలా? కోటి రూపాయలు తినేసి వంద రూపాయల సేవ చేస్తే మహనీయులైపోతారా? ఇదేమి వాదన. అదేవిధంగా ఉత్తరాంధ్రకు తలమానికంగా ఉన్న యూనివర్సిటీలో ఆక్రమణలు కూల్చుతారా అని కూడా బాబు మండిపడ్డారు. ఈ లెక్కన ఏ విద్యాసంస్థయినా యథేచ్ఛగా ఆక్రమణలు చేసుకోవచ్చన్నమాట. 

ఇక రెండో వాదన ఎప్పుడూ ఉండేదే. అదే కక్షసాధింపు. 'టిడిపి నేతలపై కక్షసాధిస్తున్నారు. మొన్న సబ్బం హరి, ఇప్పుడు గీతం యూనివర్సిటీ నిర్మాణాలను కూల్చేశారు. నిర్మించలేని వాళ్లకు కూల్చే హక్కులేదు.' ఇదీ చంద్రబాబు చెప్పిన మరోమాట. అనంతపురం జెసి దివాకర్‌ రెడ్డి కాలం చెల్లిన వాహనాలు తిప్పుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే...దాన్ని కట్టడి చేయడాన్ని కూడా కక్షసాధింపుగానే చెప్పారు. అచ్నెన్నాయుడు ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో కోట్లు మింగితే అదీ కక్షపాధింపు అన్నారు. పదిమంది కోవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోడానికి కారణమైన రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యంపై కేసులు పెడితే.,..కక్షసాధింపుగా అభివర్ణించారు. ఇప్పుడు అదీ పల్లవి అందుకున్నారు. 

గీతం యూనివర్సిటీలో ఆక్రమణలు లేవనుకుంటే లేవని చెప్పాలి. అంతేగానీ ఆక్రమణలు ఉన్నాయని తేలి, ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుంటే కక్షసాధింపు అని చెప్పడంలో అర్థం లేదు. తమ వాదనలో బలం లేపుడు ఇటువంటి సెంటుమెంటు అంశాలు తెరపైకి తెస్తారు. అయితే ఇవి చట్టం ముందు నిలబడవు. 

ఏదిఏమైనా గీతం వర్సిటీ ఆక్రమణలోని 40 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోడాన్ని అభినందించాలి. ఇటువంటి భూములు ఎక్కడున్నా గుర్తించి స్వాధీనం చేసుకుని ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వినియోగించాలి. 

                                                                                                                                        - ధర్మచక్రం ప్రతినిధి


అమరావతిలోకి ప్రవేశించడానికి వీసా కావాలా..!!

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అక్కడి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మూడు వందల రోజులకుపైగా ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు జరుగుతున్నా ఎటువంటి ఆటంకం, అభ్యంతరం లేకుండా సాగిపోతున్నాయి. ఇదే సమయంలో మూడు రాజధానులను సమర్ధించేవారు ఇదే అమరావతిలోని  ఆందోళనకు పూనుకుంటే అక్కడివారు అడ్డుకున్నారు. ట్రాక్టర్లతో తొక్కిస్తామని బెదిరిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం..?


రాజధానిలో ఆందోళనలు చేపట్టే హక్కు ఎవరికైనా ఉంటుంది. పోలీసుల వద్ద అవసరమైన అనుమతులు తీసుకుని ఆందోళనలు చేసుకోవచ్చు. ఏదైనా ఇబ్బందులు ఉంటే పోలీసులే అనుమతులు నిరాకరిస్తారు. అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమాలు చేపడితే పోలీసులు అడ్డుకుంటారు. పోలీసులు అనుమతించినా మూడు రాజధానులను సమర్ధించే వారిని... రాజధాని రైతుల పేరుతో ఆందోళనలు చేస్తున్నవారు అడ్డుకుంటున్నారు. బెదిరిస్తున్నారు. స్థానికేతరులు ఇక్కడెలా ఆందోళనలు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. 

మూడు రాజధానుల ఉద్యమానికి ఆందోళనకారులను ఆటోల్లో తరలిరావడాన్ని తప్పుబడుతూ రాసింది ఓ పత్రిక. మరి అమరావతి ఉద్యమానికి ఎవరూ తరలించకుండానే, ఎవరూ ఆర్గనైజ్‌ చేయకుండానే ఉద్యమం సాగుతోందా..? ఇటువంటి వివచక్షాపూరిత వార్తలెందుకు..?

ఇటువంటి ధోరణి గురించే ప్రజలు ఆందోళన చెందుతోంది. రాజధాని ప్రాంతంలో  50 వేల మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తే....దాన్ని న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారు. స్థానికేతరులకు రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇవ్వకూడదని వాదిస్తున్నారు. ఇప్పుడు రాజధానిలో తాముతప్ప ఇతరులెవరూ ఆందోళనలు కూడా చేయకూడదన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణిని ఒకవర్గం మీడియా కూడా సమర్ధించడం విషాదం. కార్పొరేట్‌ సంస్థలకు, బడా వ్యాపారవేత్తలకు వందల ఎకరాల భూములను ఇచ్చినపుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదుగానీ....పేదకు స్థలాలు ఇస్తామంటే మాత్రం ఆటంకాలు సృష్టిస్తున్నారు.

300 రోజులుగా అమరావతి సమర్ధకులు ఆందోళనలు చేస్తున్నా ఏఒక్కరూ అడ్డకోలేదు. ఆటంకాలు సృష్టించలేదు. మూడు రాజధానులను సమర్ధించేవారిని ఆందోళనలు ప్రారంభించిన మొదటి రోజే అడ్డుకోవడం గమనార్హం. మా ప్రాంతానికి ఎలా వస్తారంటూ బెదిరించడం చూస్తే....అమరావతి ప్రాంతానికి రావాలంటే వీసా అవసరమేమో అనే భావన ఇతర ప్రాంతాల వారికి కలుగుతుంది. ఇది అమరావతి ఉద్యమానికి మంచిది కాదు. 

ఈ పరిస్థితుల్లో అమరావతి రైతుల ఆందోళనకు ఇతర ప్రాంతాలవారి మద్దతు ఎలా లభిస్తుందన్నది ప్రశ్న. మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళనలు చేపడితే...తమ ఉద్యమం (అమరావతి అనుకూల) నీరుగారిపోతుందన్న భయం వారిలో ఉండొచ్చు. నిజంగానే అమరావతి రాజధానిపై ప్రజల్లో సెంటిమెంటు ఉంటే అంతగా భయపడాల్సిన పనిలేదు. మూడు రాజధానులను సమర్ధించేవారిని అడ్డుకుంటే...అది ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అమరావతి రైతులు తమ ధోరణిని మార్చుకోవాలి. మూడు రాజధానులను సమర్ధించే వారికీ తమలాగే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేపట్టే హక్కు ఉందనే విషయాన్ని గుర్తించాలి.             

                                                                                                      - ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ఎడిటర్‌